ఈసారైనా గ్రేడ్లు ఇవ్వాలంటున్న విద్యార్థులు
♦️ఈసారైనా గ్రేడ్లు ఇవ్వాలంటున్న విద్యార్థులు
♦️కొవిడ్ పాస్’ అని నమోదైతే నిరుపయోగం
గత రెండు నెలలుగా పరీక్షలు జరుగుతాయో, లేదో అని ఎదురుచూసిన పది, ఇంటర్ విద్యార్థులు, తల్లిదండ్రుల ఉత్కంఠకు తెరపడింది. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయడం కొందరికి ఆమోదయోగ్యంగా ఉండగా.. మరికొందరు విద్యార్థులు మాత్రం బాధపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు 57 వేలకు పైగా ఉండగా, ఇంటర్ విద్యార్థులు 63 వేల మంది వరకు ఉన్నారు. కరోనా రెండో వేవ్ విజృంభిస్తున్న మొదట్లోనే అనేక రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయి. మన రాష్ట్రంలో మాత్రం ప్రతిపక్షాలు, కొంత మంది తల్లిదండ్రులు పరీక్షలు వద్దని తెలిపినా ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. మొదట్లో మే, జూన్‌లో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని తలపెట్టినా కరోనా ప్రభావం తగ్గకపోవటంతో సాధ్యపడలేదు. ఈ మధ్యకాలంలో విద్యాశాఖ పదో తరగతి పరీక్షలకు షెడ్యూల్ రూపొందించిందని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. కొవిడ్ ప్రభావం అంతగా తగ్గకపోవటం, రోజూ 5 వేలపైగా కేసులు నమోదవ్వడంతో కొంత వెనుకడుగు వేశారు. ఎట్టకేలకు సుప్రీం తీర్పుతో పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది.
♦️గరేడ్లు ఇస్తారా.. ఉత్తీర్ణతేనా?
వరుసగా రెండోసారి పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. గత ఏడాది పరీక్ష ఫీజులు చెల్లించిన వారందర్నీ ఉత్తీర్ణుల్ని చేశారు. మొదట్లో గ్రేడు ఇస్తారనుకున్నా, ప్రైవేటు విద్యాసంస్థలకు అడ్డుకట్ట వేయలేమనే భావనతో ధ్రువపత్రాలపై కొవిడ్ పాస్ అంటూ విద్యాశాఖ జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణలో ఎఫ్‌ఏ 1, ఎఫ్‌ఏ-2 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఈసారైనా ఇక్కడ గ్రేడ్లు ఇస్తారా లేదా అనే మీమాంసలో విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారు. హెచ్‌ఎంల ద్వారా విద్యాశాఖ ఎఫ్‌ఏ-1, ఎఫ్‌ఏ-2 మార్కుల వివరాలను సేకరించింది. ఫార్మాటివ్ అసెస్‌మెంటు మార్కులు సైతం పూర్తవ్వడంతో వాటి ఆధారంగా గ్రేడ్లు ఇవ్వొచ్చని విద్యానిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్రేడ్లు ఇవ్వడం కొంత మంది విద్యార్థులకు ఆమోదంగా ఉండగా.. మెరిట్ విద్యార్థులు మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నారు. పరీక్షల రద్దు నిర్ణయంతో నిరీక్షణకు తెరపడి, ఉన్నత చదువుల ఎంపికపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
♦️సంతోషంగా ఉంది..
విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పరీక్షల రద్దు చేయడం సంతోషంగా ఉంది. కరోనా ప్రభావంతో పరీక్షలకు హాజరవ్వాలంటే మేమంతా ఎంతో భయపడ్డాం. గత కొద్ది రోజులుగా చదువుపై కూడా దృష్టిపెట్టలేకపోయాం.
💥- పి.వెన్నెలక్రాంతి, పదోతరగతి విద్యార్థి
♦️నరాశ చెందాను..
గతేడాది కూడా పదో తరగతి పరీక్షలకు కష్టపడి సిద్ధమయ్యా. రద్దుతో పాటు ఆల్‌పాసుతో నిరాశకు గురయ్యాం. ప్రస్తుతం ఇంటర్ పరీక్షల రద్దుతో, ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను, వ్యక్తిగతంగా కొంత నిరాశ చెందాను. గ్రేడింగ్ అయినా ఇస్తే బాగుంటుంది.
*💥- ఎన్.జాయ్‌క్రిస్టీ, ఇంటర్ ప్రథమ విద్యార్థిని*
anvramesh,rjy
Comments
Post a Comment